జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఎంజీబీఎస్(కారిడార్-2) వరకు మెట్రోరైలు మార్గాన్ని జేబీఎస్ స్టేషన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. మెట్రో ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్ ఎంజీబీఎస్ వరకు ప్రయాణించారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 11 కి.మీ మార్గంలో 9 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ప్రభుత్వ, మెట్రో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎంజీబీఎస్ ఇంటర్ ఛేంజ్ మెట్రోస్టేషన్‌లో మెట్రో ఉన్నతాధికారులు, ఉద్యోగులు సీఎం కేసీఆర్‌తో ఫొటోలు దిగారు. తొలి దశ మెట్రో ప్రాజెక్టులో ఇది చివరి దశ కావడంతో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.
భాగ్యనగరవాసుల కల సంపూర్ణమైంది. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో ప్రతిపాదించిన 72 కి.మీ మార్గంలో 69కి.మీ మేర మెట్రో సేవలు శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. దీంతో దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో కారిడార్‌గా నిలిచింది. ఎంజీబీఎస్ స్టేషన్ నిర్మాణం పలు ప్రత్యేకతలతో నిర్మించారు. 58 పిల్లర్లు, 6 గ్రిడ్స్‌తో పూర్తిస్థాయి స్టీల్, నాణ్యమైన సిమెంట్ కాంక్రీట్‌తో స్టేషన్‌ను నిర్మించారు.