నచ్చిన ధరకే క్యాబ్‌ సేవలు.. బేరం కూడా ఆడవచ్చు..

ట్రాఫిక్‌ రద్దీగా ఉన్నదంటే చాలు క్యాబ్‌ ధరలు అమాంతం రెండు, మూడు రెట్లు పెరుగుతుంటాయి. వినియోగదారుల అవసరాన్ని గుర్తించి క్యాబ్‌ సర్వీస్‌ సంస్థలు ప్రయాణికుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇక నుంచి ఆ బాధ లేకుండా వినియోగదారులకు నచ్చిన ధరకే క్యాబ్‌ సేవలు అందించేందుకు ఓ సంస్థ శ్రీకారం చుట్టింది.


వినియోగదారులు నిర్ణయించిన ధరకే క్యాబ్‌ సేవలు అందించేందుకు ‘ఇన్‌డ్రైవర్‌ ’సంస్థ ముందుకు వచ్చింది. హైదరాబాద్‌ వాసులకు సేవలందించడానికి 2వేల మంది డ్రైవర్లతో భాగస్వామ్యం ఏర్పర్చుకున్నది. ట్రాఫిక్‌ రద్దీ సమయాలు, రాత్రి వేళలు, వర్షం కురిసిన సమయాలు, ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న సమయంలో క్యాబ్‌ సర్వీస్‌ సంస్థలు ధరలు అధికంగా పెంచుతున్నాయి. దీంతో ఆయా సంస్థలు చెప్పిన ధరకే వినియోగదారులు సేవలను పొందాల్సి వస్తున్నది. అలా కాకుండా వినియోగదారులే సొంతంగా ఛార్జీ నిర్ణయించుకొని, ప్రయాణించేలా వినూత్న సేవలు అందించడానికి ‘ఇన్‌డ్రైవర్‌' యాప్‌ అందుబాటులోకి వచ్చింది.