దుబాయ్‌లో ఆసియాకప్‌


 ప్రపంచ క్రికెట్‌లో పెద్దన్న పాత్ర పోషించే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరోసారి తన మాట చెల్లుబాటయ్యేలా చేసుకుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది చివర్లో పాకిస్థాన్‌ వేదికగా జరగాల్సిన ఆసియాకప్‌లో పాల్గొనేది లేదని భారత్‌ పట్టుబట్టడంతో.. తప్పని పరిస్థితుల్లో టోర్నమెంట్‌ను తటస్థ వేదిక (దుబాయ్‌)కు మార్చారు. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ శుక్రవారం వివరాలు తెలిపాడు. 


 


‘దుబాయ్‌ వేదికగా ఆసియాకప్‌ జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్‌, పాకిస్థాన్‌ జట్లు పాల్గొంటాయి’అని దాదా స్పష్టం చేశాడు. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) సమావేశానికి బయలుదేరేముందు మీడియాతో మాట్లాడిన దాదా.. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత ప్రదర్శనను కొనియాడాడు. ‘హర్మన్‌ బృందం చక్కటి ప్రదర్శనతో సెమీఫైనల్‌కు చేరింది. ప్రపంచకప్‌లాంటి టోర్నీల్లో ఫేవరెట్లంటూ ఎవరూ ఉండరు. మన జట్టు బాగా ఆడుతున్నది’అని దాదా పేర్కొన్నాడు.