పాటియాలాలో లాక్ డౌన్ సమయంలో విధులు నిర్వర్తిస్తుండగా జరిగిన దాడిలో చేయి తెగిన ఏఎస్ఐ హర్జీత్ సింగ్ ను పంజాబ్ పోలీస్ డిపార్టుమెంట్ గొప్పగా సత్కరించింది. హర్జీత్ సింగ్ ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ పంజాబ్ డీజీపీ దిన్‌కర్ గుప్తా తన బ్యాడ్జికి హర్జీత్ సింగ్ పేరు పెట్టుకున్నారు.
ఏప్రిల్ 12న హర్జీత్ సింగ్ పై కత్తులతో జరిగిన దాడి.. పోలీసులు, ఇతర అత్యవసర సిబ్బందిపై జరుగుతున్న దాడుల ను వ్యతిరేకిస్తూ హర్జీత్ సింగ్ పేరును తన పేరు స్థానంలో పెట్టుకున్నట్లు డీజీపీ దిన్‌కర్ గుప్తా అన్నారు. విపత్కర పరిస్థితుల్లో తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించిన హర్జీత్ సింగ్ కు సబ్ ఇన్ స్పెక్టటర్ గా పదోన్నతి కల్పిస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు.
డీజీపీ దిన్‌కర్ గుప్తా పిలుపు మేరకు పంజాబ్ పోలీసులు తమపేర్ల స్థానంలో హర్జీత్ సింగ్ బ్యాడ్జిని పెట్టుకుని అతని సేవలకు ఘనంగా సెల్యూట్ చేశారు. హర్జీత్ సింగ్ చండీగఢ్ లోని ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. దాడిలో హర్జీత్ సింగ్ చేతిని నరికివేయగా..హర్జీత్ సింగ్ చేతిని వైద్యులు సుమారు 7 గంటల పాటు శ్రమించి రీప్లాంటేషన్ చేశారు.